ఆహా ఓటీటీలో ప్రసారమైన నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో మొదటి సీజన్ సూపర్ హిట్ అవడంతో సీజన్-2 ప్రారంభించారు. దీని కోసం బాలయ్య ముందుగా తన బావగారు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, తన అల్లుడు నారా లోకేష్‌ని రప్పించడంతో ప్రారంభమే అదిరిపోయింది. మంగళవారం విడుదలైన అన్‌స్టాపబుల్ సీజన్-2 ప్రమో చూస్తే ఈవిషయం అర్దం అవుతుంది.
ఎప్పుడూ రాజకీయాలతో బిజీబిజీగా ఉండే చంద్రబాబు నాయుడు కూడా ఈ షోలో హుషారుగా పాల్గొని బాలకృష్ణ కొంటె ప్రశ్నలకు చమత్కారంగా జవాబులు ఇస్తుంటే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
బాలకృష్ణ తన అల్లుడు నారా లోకేష్‌ని కూడా విడిచిపెట్టలేదు. “మా అమ్మాయినిచ్చి పెళ్ళి చేశాక కూడా ఈ పనేమిటి అల్లుడూ... అంటూ నారా లోకేష్ విదేశంలో స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో దిగిన ఫోటోను స్క్రీన్ మీద చూపించి నిలదీశారు. “మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు కదా?” అని ప్రశ్నించారు.
ఇక చంద్రబాబుతో బాలయ్య ఓ ఆట ఆడుకొన్నారనే చెప్పొచ్చు. “మా చెల్లి భువనేశ్వరిని మీరు ఏమని పిలుస్తారు?” అని చిలిపిగా అడిగారు. దానికి చంద్రబాబు నాయుడు ‘భువీ’ అని సమాధానం చెప్పగా, “అయితే ఇప్పుడే ఇక్కడి నుంచే మా అందరి ముందు మీ ‘భువీ’కి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలని” బాలయ్య సవాల్ విసిరారు. దాంతో చంద్రబాబు తలపట్టుకొన్నారు. కానీ బాలయ్య షోలో పాల్గొన్నందుకు తప్పదు కనుక అర్ధాంగికి ఫోన్ చేసి “హలో భువీ... ఇక్కడ నేను మీ అన్నయ్య చేతిలో అడ్డంగా ఇరుక్కుపోయానే...” అంటూ చంద్రబాబు చెప్పడం చూసి అందరూ హాయిగా నవ్వుకొన్నారు.
ఆ తర్వాత బాలయ్య “బావగారు... “రాజకీయాలు కాక మరేమైనా... చేశారా?” అంటూ మరో కొంటె ప్రశ్న వేశారు. అది విని షోలో పాల్గొన్న ప్రేక్షకులు కూడా చంద్రబాబు ఏం సమాధానం చెపుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, ఆయన కూడా ఏమాత్రం తగ్గకుండా, “నువ్వు సినిమాలలో చేశావు... నేను బయట కాలేజీలో చదువుకొంటున్నప్పుడు చాలానే చేశాను...,” అంటూ తన కుర్రతనంలో చేసిన కొంటె పనుల గురించి చెప్పడంతో అందరూ నవ్వకుండా ఉండలేకపోయారు.
“మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?” అనే బాలకృష్ణ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు ఎవరి పేరు చెపుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఒకప్పుడు తామిద్దరం బాగా కలిసి తిరిగేవాళ్ళమని చంద్రబాబు నాయుడు చెప్పారు.
మొత్తం మీద బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ‘అన్‌స్టాపబుల్-2’కి మంచి ప్రారంభం ఇచ్చి షోని బాగా రక్తి కట్టించినట్లే ఉంది ప్రమో చూస్తే. ఈ శుక్రవారం రాత్రి ఆహా ఓటీటీలో వీరి షో ప్రసారం కాబోతోంది.