ఆదిపురుషుడికి లీగల్ నోటీస్!

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్‌ను, కృతి సనన్ సీతారాములుగా వస్తున్న ఆదిపురుష్‌ సినిమా ఫస్ట్-లుక్‌, టీజర్‌ విడుదలైనప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో శ్రీరాముడు, హనుమంతుడు, రావణుడు వేషధారణపై ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హిందువులు రావణాసురుడిని సీతమ్మను అపహరించిన దుష్ట రాక్షసుడిగా భావిస్తున్నప్పటికీ, అతని వేషధారణని కూడా అంగీకరించకలేకపోతున్నారు. అలాగే రావణుడు పెద్ద గబ్బిలంపై కూర్చొని వస్తున్నట్లు చూపడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పాత్రలను పరిచయం చేసే టీజర్‌ మాత్రమే సినిమాలో వారి పాత్రలు అద్భుతంగా తీర్చిదిద్దానని దర్శకుడు ఓం రౌత్ వివరణ ఇచ్చినప్పటికీ ప్రజలు దానితో సంతృప్తి చెందలేదు. ఆశిష్ రాయ్ అనే న్యాయవాది ఆదిపురుష్‌ టీం అందరికీ లీగల్ నోటీసులు పంపారు. నోటీస్ అందుకొన్నవారిలో చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రభాస్, కృతి సనన్, సైఫ్ ఆలీఖాన్ (రావణుడు పాత్రలో నటించాడు) ఉన్నారు. ఈ సినిమాతో హిందువుల మనోభావాలు దెబ్బ తినే విదంగా తీశారని కనుక ఈ సినిమాను విడుదల చేయకుండా నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.