పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు హీరోయిన్‌గా నటించిన అనన్య పాండేకు ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తీవ్ర నిరాశ చెందింది. అయితే ఆ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మరో అవకాశం కల్పించింది. మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో అనన్య పాండేకు అవకాశం వచ్చినట్లు తాజా సమాచారం. అయితే హీరోయిన్‌గా కాదు... ఆ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ కోసం దర్శక నిర్మాతలు అనన్య పాండేను సంప్రదించిగా ఆమె చాలా భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది సూపర్ హిట్ కాంబినేషన్ అనే మంచి పేరుంది. గతంలో వారిరువురూ కలిసి చేసిన అతడు, ఖలేజా రెండూ హిట్ అయ్యాయి. కనుక ఈ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. అదీగాక వారు ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలంతో పాటు హిందీలో కూడా తీస్తున్నారు. కనుక అనన్య పాండేకు అవకాశం లభించి ఉంటే తప్పకుండా ఇది చాలా కలిసివస్తుందని చెప్పవచ్చు.
ఈ సినిమాలో మహేష్ బాబు డబుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల మహేష్ బాబుకి జోడీగా నటిస్తుండగా, కన్నడ నటుడు రవిచంద్రన్ మహేష్ బాబుకి తండ్రిగా నటిస్తున్నారు.
ఇది మహేష్ బాబు 28వ చిత్రం. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు కనుక అంతవరకు #MB28గానే పరిగణిస్తున్నారు. దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.