
తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ చాలా పోటీ ఉంటుంది. నిజానికి అన్ని రంగాలలో పోటీ ఉంటుంది. కనుక ఆ పోటీలో నిరంతరం నెగ్గేవాళ్ళే నిలుస్తారు మిగిలినవారు వెనకబడిపోయి కనుమరుగవుతుంటారు. తెలుగు సినీ పరిశ్రమలో సురేఖా వాణి ఎన్నో సినిమాలలో నటించి అటు దర్శకనిర్మాతలను, ఇటు ప్రేక్షకులను కూడా మెప్పించారు. అయితే కొంతకాలంగా ఆమె సినిమాలలో కనిపించకపోవడంతో ఆమె సినిమాలు చేయడం మానుకొన్నారేమో? అని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. కానీ “నేను సినిమాలు మానుకోలేదు. నాకు సినిమా అవకాశాలు రావడం లేదు. రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారు,” అని ఆమె సంచలనా ఆరోపణలు చేశారు. ఆమె నటించిన స్వాతిముత్యం సినిమా హిట్ అవడంతో హైదరాబాద్ ఆ సినిమా సక్సస్ మీట్ జరిగింది. దానిలో పాల్గొన్నప్పుడు ఆమె ఈ ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ముందుగా స్వాతిముత్యం సినిమాలో నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఫలానా సినిమాలో ఆ పాత్ర మీరు చేసి ఉంటే చాలా బాగుండేది,” అంటుంటారు. నిజమే నాకు చేయాలనే ఉంది. కానీ ఆ అవకాశం నా వరకు రావాలి కదా?ఎవరైనా దర్శకుడు నావద్దకు వచ్చి ఫలాన పాత్ర చేయాలని అడిగినప్పుడు మీరు ఈ పాత్రని నా కోసమే అనుకొన్నారా? అని అడుగాల్సివస్తోంది. ఎందుకంటే ఈ మద్య ఎవరూ నా దగ్గరకి రావడం లేదు. కారణం ఏమిటో తెలీదు.. నాకు సినిమా అవకాశాలు రాకుండా ఎవరు అడ్డుకొంటున్నారో కూడా నాకు తెలీదు. నాకూ సినిమా అవకాశాలు రావాలనే ఎప్పుడూ కోరుకొంటాను. నాకు అవకాశాలు వస్తున్నంత కాలం నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. నా అంతట నేను ఎన్నడూ సినిమాలు మానేయను,” అని అన్నారు.
పాత నీరు పోయి కొత్త నీరు రావడం చాలా సహజమే. అయితే సినీ పరిశ్రమలో ఎంతో మంది చాలా దశాబ్ధాలపాటు నిలద్రొక్కుకొన్నవారూ ఉన్నారు. అలాగే తాము నిలద్రొక్కుకోవడం కోసం అవసరమైతే ఇతరులను త్రోక్కేసేవారు కూడా ఉంటారు. సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. సురేఖా వాణి అందుకు మినిహాయింపు కాదు. కనుక ఇందుకు ఎవరినీ నిందించడం కూడా అనవసరం. తన మనుగడ కోసం తాను నిరంతరంగా పోరాడుతూ ఉండాల్సిందే లేకుంటే ఇలాగే వెనుకబడిపోయి కనుమరుగు కాక తప్పదు.