రాసిస్తాను నమ్మండి... ఆదిపురుష్‌ అద్భుతంగా ఉంటుంది

ఆదిపురుష్‌ సినిమాలో శ్రీరాముడు, హనుమంతుడు, రావణుడు తదితర పాత్రాల వేషధారణ, గ్రాఫిక్స్‌పై విమర్శలకు దర్శకుడు ఓం రౌత్ సమాధానం ఇచ్చినప్పటికీ, నిర్మాత దిల్‌రాజు చేత వివరణ ఇప్పించినప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. దీంతో దర్శకుడు ఓం రౌత్ మళ్ళీ మరోసారి మీడియా ముందుకు వచ్చి వివరణ ఈయవలసి వచ్చింది.

ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను ఈ సినిమాను కేవలం సినిమా థియేటర్లలో పెద్ద స్క్రీన్స్ మీద ప్రదర్శించేందుకే తీస్తున్నాను. టీజర్‌లో కేవలం పాత్రలను పరిచయం చేశాము. ఆ చిన్న వీడియోలో వాటిని చూసి సినిమాపై అంచనాకు రావొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2023, జనవరి 12న సినిమా విడుదలవుతుంది. అది చూసి ఎవరూ నిరాశ చెందరు. కావాలంటే నేను నోట్ వ్రాసివ్వడానికి సిద్దం. కనుక అంతవరకు ఈ సినిమా కోసం అందరూ ఓపికపట్టి ఎదురుచూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సినిమాలో రాముడి పాత్రను ప్రభాస్ ను మనసులో పెట్టుకొనే వ్రాశాను. ఒకవేళ ప్రభాస్ కాదని ఉంటే నేను ఈ సినిమా తీసేవాడినే కాను,” అని ఓం రౌత్ అన్నారు. 

ఇది చిన్న హీరో సినిమా అయ్యుంటే బహుశః ఎవరూ దీని గురించి పట్టించుకొనేవారే కారు. కానీ బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు, పేరు సంపాదించుకొన్న ప్రభాస్‌ హీరోగా సుమారు రూ.4-500 కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్నందునే, ఈ సినిమాకు సంబందించి ప్రతీ అంశాన్ని అందరూ నిశితంగా గమనిస్తున్నారు. అందుకే ఈ సినిమా టీజర్‌పై ఇన్ని విమర్శలు వినబడ్డాయి. అయితే ఈ సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుందని దర్శకుడు ఓం రౌత్ నమ్మకంగా చెపుతున్నారు కనుక అంతవరకు ఎదురుచూడవలసిందే.