గాడ్ ఫాదర్‌ వెరీ హ్యాపీ... హిందీలో మరో 600 స్క్రీన్లు!

హుజురాబాద్‌ ఉపఎన్నికల తర్వాత మునుగోడు ఉపఎన్నికలకు వెళుతున్న కేసీఆర్‌ ఎంత టెన్షన్ పడుతున్నారో, అలాగే ఆచార్య ఫ్లాప్ తర్వాత గాడ్ ఫాదర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పుడు చిరంజీవి కూడా టెన్షన్ పడ్డారు. అయితే గాడ్ ఫాదర్‌ సక్సస్ అవడంతో ఆయన ఊపిరి పీల్చుకొన్నారు. ఆయనతో పాటు అభిమానులు కూడా! 

గాడ్ ఫాదర్‌ హిందీలో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. హిందీ ప్రేక్షకులకు కూడా గాడ్ ఫాదర్‌ బాగానే నచ్చినట్లుంది. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఉత్తరాది రాష్ట్రాలలో మరో 600 స్క్రీన్స్‌ పెంచినట్లు చిరంజీవి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఈరోజు ట్విట్టర్‌లో ఓ వీడియో మెసేజ్‌లో చిరంజీవి మాట్లాడుతూ, “ ఈ సినిమాను సూపర్ హిట్ చేసిన అందరికీ ధన్యవాధాలు. రెండు రోజులలోనే గాడ్ ఫాదర్‌ రూ.69 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి విజయవంతంగా నడుస్తోంది. సినిమా విడుదలైన రెండో రోజునే మరో 600 స్క్రీన్స్‌ పెంచినట్లు నాకు సమాచారం వచ్చింది. మీరందరూ కలిసి ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా నిలిపారు. ఇందుకు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” చిరంజీవి అన్నారు.