
ప్రముఖ సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మకమైన డా.సి.నారాయణరెడ్డి సాహితీ అవార్డు అందుకొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలో యువ కళావాహిని అధ్యర్యంలో డా.సి.నారాయణరెడ్డి సాహితీ అవార్డు ప్రధాన కార్యక్రమం జరిగింది. ప్రముఖ బయోటెక్ కంపెనీ శాంతా బయోటెక్స్ అధినేత పద్మభూషన్ అవార్డు గ్రహీత వరప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా సుద్దాల అశోక్ తేజ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకొన్నారు.
సుద్దాల అశోక్ తేజ స్వస్థలం జనగామ జిల్లాలోని సుద్దాల గ్రామం. ఆయన తండ్రి సుద్దాల హనుమంతు కూడా ప్రముఖ కవే. తండ్రి నుంచి కవిత్వాన్ని వారసత్వ ఆస్తిగా అందుకొన్న సుద్ధాల అశోక్ తేజ బాల్యం నుంచే కవిత్వం రచించేవారు. సినిమాలలోకి రాక మునుపు ఆయన కరీంనగర్ జిల్లాలోబండలింగాపూర్, మేడిపల్లి, మెట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు.
ఒసేయ్ రాములమ్మ, నిన్నే పెళ్ళాడుతా చిత్రాలకు ఆయన వ్రాసిన పాటలు ఆయనకు మంచి గుర్తింపునిచ్చాయి. సుద్దాల అశోక్ తేజ ఇప్పటివరకు సుమారు 2,200కి పైగా సినిమా పాటలు వ్రాశారు. ఆయన వ్రాసిన ‘నేను సైతం...’ పాటకిగాను 2003లో జాతీయ అవార్డు అందుకొన్నారు. ఆ తర్వాత ఆయన అనేక అవార్డులు, సన్మానాలు పొందుతూ నేటికీ తెలుగుజాతి ఔనత్యాన్ని చాటి చెప్పే చక్కటి పాటలు రచిస్తూనే ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన డా.సి.నారాయణరెడ్డి సాహితీ అవార్డు అందుకొనందుకు సినీ, సాహిత్య, కళా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.