
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో టైటిల్ సాంగ్ విడుదలైంది. విశేషమేమిటంటే ఈ పాటను వ్రాసిన రామజోగయ్య శాస్త్రి దానిని ముందే ట్విట్టర్‌లో పోస్ట్ చేసేశారు. ఆ పాట లిరిక్స్ చాలా అద్భుతంగా ఉండటంతో మెగా అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఈ పాటే హైలైట్ అవుతుందని వారు చెపుతున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ చిత్రానికి ఇది రీమేక్. పైగా చిరంజీవి ఇమేజీకి తగ్గట్లుగా దర్శకుడు మోహన్ రాజా చాలా మార్పులు చేశారు. ఆచార్యతో తీవ్ర నిరాశ చెందిన అభిమానులు రేపు విడుదల కాబోతున్న గాడ్ ఫాదర్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. చిరంజీవి కూడా ఈ సినిమా ఫైనల్ కాపీని చూసి చాలా బాగా వచ్చింది... నాకైతే చాలా సంతృప్తికలిగిందని మీడియాతో చెప్పారు. కనుక మెగా అభిమానులు కూడా ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.
గాడ్ ఫాదర్ సినిమాను రామ్ చరణ్, ఆర్‌బీ.చౌదరి కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చిరంజీవికి బాడీ గార్డుగా నటించారు. ఈ సినిమాలో సత్యదేవ్, సునీల్, దీవి వద్యా, దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ జర్నలిస్టుగా నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాకి ధమన్ సంగీతం, కెమెరా వర్క్స్ నీరావ్ షా అందించారు.