తెలుగు సినీ పరిశ్రమకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అనేక సినీ స్టూడియోలున్నాయి. ఇప్పుడు మరో స్టూడియో వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన తండ్రి, ప్రముఖ హాస్యనటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య పేరిట గండిపేట వద్ద అల్లు స్టూడియోను నిర్మించారు. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోని ఆయన అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ముందుగా స్టూడియో ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాలవేసి అందరూ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “ఆనాడు మా మావయ్యగారు అల్లు రామలింగయ్య సినిమాలపై మక్కువతో మద్రాస్ వెళ్ళడం వలననే నేడు మేమందరం సినిమాలలో ఉన్నాము. ఈ స్థాయికి ఎదిగి అందరి ప్రేమాభిమానాలు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలిగాము. నేడు ఇంత పెద్ద వ్యవస్థగా మారగలిగాము. కనుక మేమందరం అల్లు రామలింగయ్యగారికి ఎల్లప్పుడూ రుణపడిఉంటాము. అల్లువారి కుటుంబంలో నేనూ భాగస్వామినైనందుకు నా పూర్వజన్మ సుకృతంగా, చాలా అదృష్టంగా భావిస్తున్నాను,” అని అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, “ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ స్టూడియోని ప్రారంభించడానికి వచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవిగారికి నేను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మా అందరికీ మా తాతయ్య అల్లు రామలింగయ్యగారి పుట్టినరోజు ఎప్పుడూ ప్రత్యేకమైనదే... పండగ వంటిదే. నేడు ఆయన 100వ పుట్టినరోజు ఇంకా ప్రత్యేకమైనది. మా నాన్నగారు అల్లు అరవింద్ గారికి ఇప్పటికే ఓ సినీ నిర్మాణ సంస్థ (గీతా ఆర్ట్స్) ఉంది. అనేక స్థలాలు, స్టూడియో పెట్టేందుకు కావలసినంత డబ్బు చేతిలో ఉన్నాయి. కానీ ఇంకా డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో ఈ స్టూడియో నిర్మించలేదు. ఇది మా తాతయ్య చిరకాల కోరిక. ఆయన జ్ఞాపకార్ధం దీనిని నిర్మించాము. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోలో మంచి సినిమాలు షూటింగ్ జరుపుకొని, సినీ పరిశ్రమకు సేవలు అందించాలనే మా ప్రధానోద్దేశ్యం,” అని అన్నారు.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి మెగా ఫ్యామిలీ సభ్యులందరితో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
(Video courtecy: ETV)