
మాస్ మహారాజ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవడంతో వారం రోజులలోనే తీసేయవలసివచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం అవుతోంది. శరత మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా నటించాడు. దివ్యాంక కౌశిక్, రాజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటించారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవడంతో అతను కూడా చాలా నిరాశ చెందాడు. కధ, కధనంలో కొత్తదనం ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. థియేటర్లలో ఫెయిల్ అయిన ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులైనా చూస్తారో లేదో?
రామారావు ఆన్ డ్యూటీ ఫెయిల్ అయినప్పటికీ రవితేజ ఏ మాత్రం నిరుత్సాహపడకుండా వెంటనే తన తదుపరి చిత్రాలైన టైగర్ నాగేశ్వర రావు, ధమాకా, రావణాసుర సినిమాలు ఒకేసారి చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
వంశీకృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర రావు ఇదివరకే మొదలుపెట్టాడు. ఇప్పుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ధమాకా, సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర మూడు చిత్రాలను ఒకేసారి చేస్తున్నాడు. ఈ మూడు కాక కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగిల్ అనే మరో సినిమాకు కూడా సైన్ చేశాడు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ పోలాండ్ దేశంలో ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేయబోతోంది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జాన్‌విక్’ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు సమాచారం.