చిన్న సినిమాలతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను: మారుతి

దర్శకుడు మారుతి మొదట్లో ఎటువంటి సినిమాలు చేశాడో అందరికీ తెలుసు. కానీ వాటితో వస్తున్న గుర్తింపు కంటే ఇండస్ట్రీలో, ప్రేక్షకులలో తనపై ఓ చెడు అభిప్రాయం ఏర్పడుతోందని గ్రహించినప్పటి నుంచి డీసెంట్ సినిమాలు తీయడం ప్రారంభించి మంచి పేరు తెచ్చుకొన్నాడు. మారుతి అంటే మినిమమ్ గ్యారెంటీ సినిమా, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలనే మంచి పేరు సంపాదించుకొన్నాడు. 

నూతన దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో అజయ్, వీర్తి వఘాని జంటగా నటించిన కొత్త కొత్తగా సినిమా ఎల్లుండి (శుక్రవారం) విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు మారుతి, “నేను చిన్న సినిమాలతోనే ఈ స్థాయికి ఎదిగాను. కనుక చిన్న సినిమాలు హిట్ అవ్వాలని కోరుకొనేవారిలో నేను ముందుంటాను. చిన్న సినిమా అంటే మద్య తరగతి కుటుంబం వంటిది. మద్య తరగతి బాగుంటేనే మిగతా అన్ని తరగతులు కూడా బాగుంటాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకొంటున్నాను,” అని అన్నారు. 

ఈ సినిమా దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ, “ఇదొక యూత్ ఫుల్ రోమాంటిక్‌ చిత్రం. ఎంత గొప్ప భోజనం వడ్డించినా చివరిలో స్వీట్ తింటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. మా ఈ సినిమా కూడా ఆ స్వీట్ వంటిదే. అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము,” అని అన్నారు. 

ముక్కర మురళీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా బీజీ గోవిందరాజు సమర్పణలో ఈ నెల 9వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.