
ప్రముఖ సినీ కధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల ‘పరుచూరి పాఠాలు’ పేరుతో కొత్త సినిమాలలో మంచీచెడు, లోటుపాట్ల గురించి వీడియో రూపంలో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “రాజకీయ నాయకులందరికీ ఎన్నికలలో పోటీ చేసి గెలవాలి. శాసనసభ లేదా పార్లమెంట్లో అడుగు పెట్టాలి. మంత్రి పదవులు చేపట్టాలనే కోరిక ఉంటుంది. అయితే సమాజాన్ని మార్చాలనే కోరికతో రాజకీయాలలోకి వస్తున్నవారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటివారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.
పవన్ కళ్యాణ్ చాలా మంచి మనిషి. ఆయనను నేను చాలా దగ్గర నుంచి చూశాను. మంచి నడవడిక, ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి. ఎవరు తన వెనక వచ్చినా రాకపోయినా ఒంటరిగానైనా పోరాడేందుకు సిద్దపడే నైజం ఆయనది. ఆయన ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది పక్కనపెడితే అటువంటి ఉన్నత ఆశయాలు ఉన్నవ్యక్తి తప్పక శాసనసభలో అడుగు పెట్టాలని నేను కోరుకొంటున్నాను. శాసనసభలో ప్రజల తరపున పవన్ కళ్యాణ్ తన గొంతు వినిపించాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి పరుచూరి చెప్పిన దానికి చిన్న నిదర్శనంగా ఆయన ఏపీలో ఆత్మహత్యలు చేసుకొన్న 70 మందికి పైగా కౌలు రైతుల కుటుంబాలు ఒక్కొక్కరికి లక్ష చొప్పున తన సొంత డబ్బు పంచిపెట్టడాన్ని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టి అక్కడ తన జనసేన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం బిజెపితో కలిసి నడుస్తున్నప్పటికీ మళ్ళీ టిడిపితో చేతులు కలిపి గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దాలని భావిస్తున్నారు.