
ఆగస్ట్ 5వ తేదీన ఒకేసారి విడుదలైన సీతారామం, బింబిసార రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ప్రేక్షకుల కంటే తెలుగు సినీ పరిశ్రమ ఎక్కువగా సంతోషించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో రూపొందిన సీతారామం ఓ అందమైన ప్రేమ కధ కాగా, మల్లాది వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో వచ్చిన బింబిసార సోషియో ఫ్యాంటసీ చిత్రం. ఒకేరోజున రెండు పూర్తి భిన్నమైన జానర్లలో వచ్చిన రెండు సినిమాలు హిట్ అవడంతో భారీగా కలెక్షన్లు వసూలు చేశాయి.
ఈ సినిమాలు విడుదలై నాలుగు వారాలు దాటింది కనుక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సీతారామం సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. బింబిసార కూడా అదే రోజు నుంచి జీ5 ఓటీటీలో ప్రసారం కాబోతున్నట్లు సమాచారం.
థియేటర్లలో సినిమాలు విడుదలైన 8వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయం ప్రకటించకమునుపే ఆ రెండు సినిమాలు ఓటీటీ ఒప్పందాలు చేసుకొన్నందున సెప్టెంబర్ 9వ తేదీ నుంచి వాటిలో ప్రసారం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అవి కూడా ఫిలిం ఛాంబర్ తాజా నిర్ణయానికి కట్టుబడి ఉండాలనుకొంటే ఓటీటీలో విడుదల మరో నెలరోజులు ఆలస్యం కావచ్చు.