మనసులు కలిశాయి... చాలు: మహాలక్ష్మి

ఆమె చూస్తే సన్నగా నాజూకుగా బాపు బొమ్మలా అందంగా ఉంటుంది. అతను చూస్తే ఊబకాయం. నడవడానికి కూడా ఇబ్బందిపడుతుంటాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకొన్నారు. వారు అనామకులైతే అది ఒకటి రెండు రోజుల వార్తగా ఉండి... పోతుంది. కానీ ఆమె ప్రముఖ టీవీ సీరియల్ నటి మహాలక్ష్మి. అతను ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్. సెప్టెంబర్‌ 1వ తేదీన వారిరువురు తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకొన్నారు. వారి పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

వారి జంటపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఆస్తికోసం, సినిమా అవకాశాల కోసమే మహాలక్ష్మి ఆయనతో పెళ్ళికి సిద్దపడిందని, అంత ఊబకాయం ఉన్నవాడిని కట్టుకొని ఏం సుఖపడతావని కామెంట్స్ చేస్తున్నారు. వారి జోడీ చాలా భిన్నంగా ఉండటంతో వారిని ఎదురుగా మెచ్చుకొని అభినందిస్తున్నవారు కూడా వెనక నవ్వుకోకుండా ఉండరు. 

అయితే తమ గురించి ఎవరు ఏమనుకొన్నా పట్టించుకోమని మహాలక్ష్మి అంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న తనకు రవీందర్ చంద్రశేఖరన్ చాలా కాలంగా తెలుసని, ఆయన చాలా మంచి మనిషని చెప్పారు. ఓ రోజు ఆయనే మనం పెళ్ళి చేసుకొందామా?అని మెసేజ్ పెడితే మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఆలోచించుకొని అంగీకరించానని మహాలక్ష్మి చెప్పారు. తనకు ఆయన మనసు, ప్రేమాభిమానాలే ముఖ్యం తప్ప ఆయన శరీరాకృతి కాదని చెపుతున్నారు. 

రవీందర్ చంద్రశేఖరన్ మీడియాతో మాట్లాడుతూ, “బాడీ షేమింగ్ నాకు కొత్తకాదు. చాలా కాలంగానే ఎదుర్కొంటున్నాను. కనుక ఇప్పుడు మళ్ళీ ఈ విమర్శలను నేను పట్టించుకోను. మహాలక్ష్మి మనస్ఫూర్తిగా అంగీకరించినందునే మేము వివాహం చేసుకొన్నాము. మాకు లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకు?” అని ప్రశ్నించారు.