కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా154వ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు బాబీ తండ్రి కొల్లి మోహన్ రావు అనారోగ్యంతో చనిపోయారు. ఐదు రోజుల తర్వాత బాబీ మళ్ళీ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు రావడం చూసి చిరంజీవితో సహా అందరూ ఆశ్చర్యపోయారు.
బాబీ తండ్రి కూడా చిరంజీవి వీరాభిమాని. కనుక తన కొడుకు చిరంజీవి సినిమాకి దర్శకత్వం చేస్తుండటంతో ఆయన చాలా పొంగిపోయేవారు. ఈ సినిమా పూర్తయితే చూడాలని చాలా తపించిపోయారు. కానీ ఆ కోరిక తీరక మునుపే చనిపోయారు. కనుక చిరంజీవి సినిమాను సూపర్ హిట్ అయ్యేవిదంగా రూపొందించడమే తన తండ్రికి తాను ఇవ్వగల గొప్ప నివాళి అని, అందుకే వెంటనే షూటింగ్‌కి వచ్చేశానని బాబీ చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘వాల్తేర్ వీరయ్య’ అని పేరు అనుకొన్నారు కానీ అది చాలా పాతకాలం పేరులా ఉందని అభిమానులు సూచించడంతో మరో పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ సినిమాకు బాబీ కధ, డైలాగ్స్ అందించగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2023 జనవరిలో సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతోంది.