బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రహ్మాస్త్ర (తెలుగులో బ్రహ్మాస్త్రం) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగవలసి ఉండగా రద్దు అయ్యింది. నిన్న హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలు జరుగుతునందున వాటికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయవలసి వచ్చింది. కనుక బ్రహ్మాస్త్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పోలీసులను కేటాయించలేమని పోలీస్ శాఖ తెలిపింది. దాంతో ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు చేసుకొని ప్రెస్‌మీట్‌తో సరిపెట్టవలసి వచ్చింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు జూ.ఎన్టీఆర్, రాజమౌళి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ, “ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం నాకు కూడా చాలా నిరాశ కలిగించింది. దీనిలో పాల్గొనాలనుకొన్న నా అభిమానులకు ముందుగా క్షమాపణలు చెపుతున్నాను. పోలీసులు మన భద్రత కోసమే ఉన్నారు. కనుక వారు చెప్పింది వినటం మన ధర్మం. అందుకే పోలీసుల సూచన మేరకు ఈ చిన్న వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాం.
హిందీలో నా అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్. ఆయన తర్వాత నేను ఎక్కువ ఇష్టపడేది రణబీర్ కపూర్‌నే. నా అభిమాన హీరోలతో కలిసి ఈ వేదిక పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తెలుగు నటుడు హిందీ చిత్రంలో నటించి హిందీలో మాట్లాడితే ఎలా ఉంటుందనేది నేను నాగార్జున బాబాయ్ నటించిన ఖుదా గవా చూసి తెలుసుకొన్నాను. ఈ సినిమాలో నాగ్ బాబాయ్ హిందీలో మాట్లాడారనుకొంటా.
ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ ఆల్ ది బెస్ట్. ఇటువంటి వెరైటీ కధలతో వస్తే ప్రేక్షకులు తప్పకుండా అదరిస్తారనే నమ్మకం నాకుంది. మనపై ఒత్తిడి ఉన్నప్పుడే ఇంకా బాగా పనిచేయగలుగుతాము అప్పుడే మనలో ఉన్న టాలెంట్ బయటపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సవాళ్లను ఇండస్ట్రీ స్వీకరించాలి. నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడాలని ఈ మాటలు అనడం లేదు. ప్రేక్షకులకు మరింత మంచి కధలతో మంచి సినిమాలు అందిద్దాం,” అని అన్నారు.
రూ.450 కోట్ల బారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్, స్టార్ స్టూడియోస్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.