
జాతిరత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టి చెప్పిన ఓ డైలాగ్ అప్పట్లో నవ్వులు కురిపించాయి. కానీ అదే డైలాగ్ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ అవుతోంది. దానికి కారణం దానిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా ప్రస్తావన ఉండటమే. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ఆ సినిమా ప్రదర్శింపబడుతుండటంతో జాతిరత్నాలలో ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం షేర్ చేసుకొంటూ ఆనందిస్తున్నారు.
జాతిరత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టిని అతని స్నేహితులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ “నువ్వు మాకోసం ఏం చేశావురా?” అంటూ ప్రశ్నించినప్పుడు, అతను షాక్ అయ్యినట్లు మొహంపెట్టి, “ఏం చేయలేదురా మీ కోసం నేను... 2008, మార్చి 27 నటరాజ్ థియేటర్, సంగారెడ్డి... జల్సా సినిమా రిలీజ్ ఆరోజు... నేను బాల్కనీలో ఉన్నాను. మీరు కింద రూ.10 టికెట్లో ఉన్నారు. అప్పుడు నేను పైకి తీస్కారాలేదరా ఆరోజు మిమ్మల్ని... నా నేచర్ రా అది” అని అంటాడు.
అతనేదో వాళ్ళని ఉద్దరించినట్లు చెపుతుంటే ఆ డైలాగ్ విని అప్పుడు ప్రేక్షకులు పడిపడి నవ్వుకొన్నారు. ఇప్పుడు జల్సా సినిమా గురించి ఆ సినిమా డైలాగ్‌ని అందరూ మరోసారి గుర్తు చేసుకొని హాయిగా నవ్వుకొంటున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునాడు ఆ సినిమా డైలాగ్ మరోసారి వినపడటం భలే టైమింగ్ అనిపిస్తుంది.