నన్ను ట్రోల్ చేస్తే అంతే మరి.. వదిలిపెట్టేదేలే

పాములు ఆడించేవాడు పాము కాటుకే బలైనట్లు సోషల్ మీడియాతో ఆడుకొనేవారు దానికే బలవుతుంటారు. ఆగస్ట్ 25న భారీ అంచనాలతో లైగర్‌ విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకొన్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఒకరు నష్టపోతే మరొకరు పండగ చేసుకోవడం మామూలే. కానీ యాంకర్ నుంచి నటిగా మారిన అనసూయ కూడా లైగర్‌ ఫ్లాప్ అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ... కొన్నిసార్లు రావటం లేటవచ్చేమోకానీ, రావటం పక్క!!” అని ట్వీట్ చేశారు. 

గతంలో కూడా ఆమె విజయ్ దేవరకొండ సినిమాపై కామెంట్స్ చేసి ఉండటంతో ఆమె లైగర్‌ ఫ్లాప్ అయినందుకు సంతోషిస్తూ ఈ ట్వీట్ చేశారని భావించిన అభిమానులు, ఆమె జబర్దస్త్ షోలో చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ మొదలు ఆమె సినిమాల వరకు అన్నిటినీ ప్రస్తావిస్తూ ఆంటీ... ఆంటీ అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వాటికి ఆమె కూడా ధీటుగా బదులిస్తుండటంతో, నెటిజన్స్ ఇంకా రెచ్చిపోయారు. 

అయితే ఇక్కడ ఒకవైపు అనసూయ ఒక్కరే ఉండగా అవతలివైపు వేలాదిమంది నెటిజన్స్ ఉండటంతో యుద్ధం ఏకపక్షంగా సాగింది. దీంతో అహం దెబ్బ తిన్న అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మొదట తనను ట్రోల్ చేస్తున్నవారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఉపేక్షించానని కానీ వారు హద్దు మీరుతుండటంతో సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశానని అనసూయ తెలిపారు. “జరగాల్సింది.. జరగాలి. నా పిర్యాదుపై స్పందించి, నాకు మద్దతు ఇచ్చిన సైబర్ క్రైమ్ అధికారులకు ధన్యవాదాలు,” అని అనసూయ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.