నాకు గాడ్ ఫాదర్ లేరు... మార్గదర్శకులు లేరు: నిఖిల్

కార్తికేయ2 తో యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన నిఖిల్ ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించడానికి కారణం కధే అని చెప్పాడు. కార్తికేయ2 విడుదలైన మొదటి రోజు నుంచి కలక్షన్ల సునామీ సృష్టిస్తూ వందకోట్ల క్లబ్‌లో చేరబోతోంది. 

ఈ సందర్భంగా నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. కనీసం ఇలా ముందుకు వెళ్ళాలని చెప్పే మార్గదర్శకులు కూడా లేరు. కానీ అదృష్టవశాత్తు ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడే ‘హ్యాపీడేస్’ వంటి మంచి సినిమాలో అవకాశం దొరికింది. ఆ ఊపులో వరుసగా ఆరు సినిమాలు చేశాను కానీ అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. ఆరేళ్ళ తర్వాత ‘స్వామి రారా’తో హిట్ అందుకొన్న తర్వాత గానీ తత్వం బోధపడలేదు. సరైన కధ ఎంచుకోవడం తెలియకనే కెరీర్‌లో చాలా నష్టపోయానని గ్రహించాను. సినిమాకి కధ ఎంత ముఖ్యమో కార్తికేయ2తో బాగా గ్రహించాను. 

సినిమా ఇండస్ట్రీ ఓ రోలర్ కోస్టర్ వంటిది. దానిలో ఎక్కాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఆ ప్రయత్నంలో నాలాగే ఎదురుదెబ్బలు తింటుంటారు. అయితే జీవితంలో ఇవన్నీ ఓ భాగమే... సమస్యలను ఏవిదంగా అదిగమించాలో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అదే... ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడే గాడ్ ఫాదర్ లేదా మార్గదర్శకులు దొరికి ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవే కావు. కానీ ఎదురుదెబ్బలు తిని అనుభవంతో నేర్చుకొన్న ఈ జీవిత పాఠాలు చాలా అమూల్యమైనవి,” అని అన్నాడు.