కమల్ హాసన్ ఇండియన్-2 షూటింగ్ త్వరలో ప్రారంభం

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఇండియన్-2 సినిమాకు బుదవారం చెన్నైలో పూజా కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నామని లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి కమల్ హాసన్ ఈ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నట్లు తెలిపింది. 

దీంతో పాటు శంకర్ దర్శకత్వంలోనే రామ్ చరణ్‌ హీరోగా #ఆర్‌సీ15 సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని తెలిపింది. ఒకే సమయంలో శంకర్ రెండు సినిమాలను డైరెక్ట్ చేయబోతున్నారని ట్విట్టర్‌లో తెలియజేసింది. ఇది విని కమల్ హాసన్, రామ్ చరణ్‌ అభిమానులలో ఆందోళన మొదలైంది. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలను ఒకేసారి డైరెక్ట్ చేయాలనుకోవడం సరికాదని, ఆవిదంగా చేస్తే రెండూ నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్‌కు సీక్వెల్‌గా ఈ ఇండియన్-2 తీస్తున్నారు. రెండేళ్ల క్రితం దీని షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత అనేక సమస్యలు ఎదురవడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఎట్టకేలకు అన్ని సమస్యలు పరిష్కరించుకొని, షూటింగ్ మొదలుపెడుతునప్పుడు దర్శకుడు శంకర్ రెండు పడవలలో కాళ్ళు పెట్టి ప్రయాణించాలనుకొంటూ తాను మునిగి రెంటినీ కూడా ముంచేస్తాడని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్-2లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సిద్దార్ధ్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన వివేక్ కొంతకాలం క్రితం గుండెపోటు వచ్చి చనిపోయినందున ఆయన స్థానంలో మరో నటుడిని తీసుకొని, అతనితో వివేక్ నటించిన ఆ సన్నివేశాలన్నిటినీ మళ్ళీ షూట్‌ చేయబోతున్నారు.  సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ కలిసి ఇండియన్‌-2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయంత్ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: రవి వర్మన్, సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ అందిస్తున్నారు.