అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు: అనసూయ

ప్రముఖ నటిగా మారిన అందాల యాంకర్ అనసూయ ఈరోజు ఓ ట్వీట్ చేసింది. అది చూసి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు విజయ్ దేవరకొండ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకీ ఆమె ఏమి ట్వీట్ చేశారంటే, “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ... కొన్నిసార్లు రావడం లేటవ్వవచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా!! అని తెలుగులో ట్వీట్ చేసి దాని కింద #Not Happy on someone’s sadness but #Faith restored (మరొకరి దుఃఖాన్ని చూసి సంతోషపడను కానీ నమ్మకం నిజమైంది) అని ట్వీట్ చేశారు. 

గతంలో ఆమె అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పుడు ఇలాగే ట్వీట్ చేయడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకొన్నారు. ఈరోజు విడుదలైన లైగర్‌ సినిమాకు మిశ్రమస్పందన వస్తుండటంతో ఆమె లైగర్‌ గురించే అని ఉంటారని భావించి, మళ్ళీ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.మరొకరి దుఃఖాన్ని చూసి సంతోషపడను కానీ నమ్మకం నిజమైంది అని లోలోన సంతోషపడుతున్నందుకు ఆ బాధపడుతున్నవారి ఆగ్రహం భరించక తప్పదు.