పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా..... ఫైరు!

పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా..... ఫైరు! అంటూ అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ డైలాగ్‌ను మరో స్టార్ హీరో చెపితే ఎలా ఉంటుంది? కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ పుష్పలోని ఈ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించాడు.

విక్రమ్ నటించిన కోబ్రా సినిమా ఈ నెల 31న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందంతో కలిసి మధురైలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులలో ఒకరు పుష్పలో ఏదైనా ఓ డైలాగ్ చెప్పమని కోరితే, విక్రమ్ “అలాగే... ఒక రకంగా కాదు.. పది రకాలుగా చెపుతా,” అంటూ పుష్ప తమిళ వెర్షన్‌లోని  పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా..... ఫైరు! అనే డైలాగును పది రకాలుగా చెప్పి ప్రేక్షకులను మెప్పించారు.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందిన కోబ్రా చిత్రంలో విక్రమ్ విభిన్న గెటప్పులలో కనిపించబోతున్నారు. ఇదివరకు ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తీసిన దానవీరశూరకర్ణ చిత్రంలో మూడు పాత్రలలో నటించి మెప్పించగా, ఆ తర్వాత దశావతారంలో కమల్ హాసన్ ఏకంగా పది పాత్రలలో నటించి మెప్పించారు. ఇప్పుడు విక్రమ్ కూడా అటువంటి ప్రయత్నం చేస్తుండటంతో ఈ సినిమా కోసం ఆయన అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే దర్శకుడు కెఎస్ రవికుమార్, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.