తెలుగు
ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు మంగళవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు.
వారి తరపున ప్రముఖ నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ, “గత 22 రోజులుగా
సినిమా షూటింగ్స్ నిలిపివేసి ఇండస్ట్రీలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రతీరోజు 5-6
గంటలు చొప్పున ఇండస్ట్రీతో సంబందం ఉన్న ప్రతీ వర్గంతో మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించుకొంటూ
వస్తున్నాము. ఈ నెలాఖరుకి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాము. కనుక సెప్టెంబర్
1వ తేదీ నుంచి సినిమా షూటింగులు ప్రారంభించుకోవాలని నిర్ణయించాము. ఒకవేళ ఎవరైనా అత్యవసరమనుకొంటే
ఫిలిమ్ ఛాంబర్ అనుమతి తీసుకొని గురువారం నుంచే షూటింగ్ ప్రారంభించుకోవచ్చు.
రెండు
తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం 1800 థియేటర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి
వర్చువల్ ప్రింట్ ఛార్జీలు వసూలు చేయకూడదని అందరం అంగీకరించాము. థియేటర్లలో తినుబండారాలు, టికెట్ ధరలు ప్రేక్షకులకు
అందుబాటు ధరల్లో ఉంచాలని నిర్ణయించాము. ఈ నెల 30వ తేదీన మళ్ళీ మరోసారి ప్రెస్మీట్
పెట్టి పూర్తివివరాలు మీడియాకు తెలియజేస్తాము,” అని చెప్పారు.
చిత్రసీమలో
సమస్యల పరిష్కారానికని నెలరోజులు షూటింగులు నిలిపివేయడంపై నిర్మాతలలోనే భిన్నాభిప్రాయాలు
వ్యక్తం అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఇదే దిల్రాజు, సి.కల్యాణ్ తదితరులు ఏపీ
సిఎం జగన్మోహన్ రెడ్డిని, మాజీ మంత్రి పేర్ని నానిని కలిసి టికెట్
ధరలు పెంచుకోవడానికి అనుమతి కోరారు. ఇప్పుడు వారే టికెట్ రేట్లు తగ్గించి ప్రేక్షకులకు
అందుబాటులో ఉండేలా చేస్తామని చెపుతున్నారు.
లక్షలాదిమందితో
కూడిన తెలుగు సినీ పరిశ్రమలో సమస్యలన్నిటినీ శాస్వితంగా పరిష్కరించడం అసంభవం అని తెలిసి
ఉన్నా వాటి కోసం నెలరోజులు సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం సరికాదని, దీంతో చిన్న నిర్మాతలను, థియేటర్ యజమానులను ఇబ్బంది పెట్టడమే తప్ప మారేది ఏమీ ఉండదనే అభిప్రాయం ఇండస్ట్రీలో
వినిపిస్తోంది. రేపు మళ్ళీ మరో సమస్యవస్తే మళ్ళీ షూటింగులు నిలిపివేస్తారా? అని ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు.