మహేష్-రాజమౌళి సినిమా: దసరాకి కొబ్బరికాయ?

మహేష్ బాబు, రాజమౌళి కలిసి సినిమా చేయబోతున్నట్లు చెప్పినప్పటి నుంచి అభిమానులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో ఈ సినిమాకి కధ అందించబోతున్న విజయేంద్రప్రసాద్ లేదా మరొకరో చెప్పే చిన్న చిన్న విషయాలు మాత్రమే వినిపిస్తున్నాయి తప్ప ఈ సినిమా ఇంకా ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఎవరూ చెప్పలేదు. 

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఈ ఏడాది దసరానాడు అంటే అక్టోబర్ 5వ తేదీన పూజా కార్యక్రమాలు నిర్వహించి, 2023 వేసవిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 2024 వేసవిలోగా సినిమా విడుదలచేయాలని ఈ సినిమా నిర్మాత కెఎల్ నారాయణ చెప్పినట్లు తెలుస్తోంది. 

కానీ రాజమౌళి సినిమా అంటే కనీసం మూడేళ్ళు తీసుకొంటారు కనుక అక్టోబర్‌లో కొబ్బరికాయ కొట్టి 2023 వేసవిలో సినిమా మొదలుపెట్టవచ్చునేమో కానీ రిలీజ్ మాత్రం 2026లోనే ఉండవచ్చు. అంతవరకు మహేష్ బాబు సినిమాలు మరి ఉండవన్నమాట! అంతవరకు మహేష్ అభిమానులు ఓపికగా ఎదురుచూడక తప్పదు. అలాగే మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా మొదలుపెట్టేలోగానే తన ఇతర సినిమాలన్నీ పూర్తిచేయవలసి ఉంటుంది.       

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా గురించి ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న కొన్ని విషయాలు: ఈ సినిమా సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ లా ఉండబోతోందని విజయేంద్రప్రసాద్ చెప్పారు. ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విక్రమ్‌ని లేదా నందమూరి బాలకృష్ణను ఓ ముఖ్యపాత్రలో తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.