గీతాగోవిందం సినిమా షూటింగ్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందనల మద్య పరిచయం, ఆ తర్వాత స్నేహంగా ప్రేమగా మారిందనే గుసగుసలు నేటికీ వినబడుతూనే ఉన్నాయి. మా మద్య స్నేహం తప్ప మరేమీ లేదని ఇద్దరూ చాలాసాలు చెప్పినప్పటికీ, వారిలో ఎవరు ఏ సినిమా ఫంక్షన్లో కనబడినా మీడియా ప్రతినిధులు ఇదే విషయం గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. దీంతో ఇద్దరూ విసుగెత్తిపోయారు కానీ మీడియా మాత్రం వారిని విడిచిపెట్టడం లేదు. పుష్ప సినిమాతో రష్మిక మందన జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో ఇటీవల జాతీయ మీడియా ఆమెను ఇంటర్వ్యూ చేసింది. మళ్ళీ అక్కడా విజయ్ దేవరకొండతో ప్రేమ గురించి ప్రశ్న ఎదురవడంతో రష్మిక సహనం కోల్పోయింది.
“సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉండటం సహజమే కానీ పదేపదే ఇదే ప్రశ్న అడుగుతుండటం సరికాదు. నేను చేస్తున్న సినిమాల గురించి అడగొచ్చు కదా?మీతో కావలసినంతసేపు వాటి గురించి మాట్లాడుతాను. నా ప్రేమ, పెళ్లి విషయంలో స్వయంగా నేనే ముందుగా మీకే తెలియజేస్తాను. కనుక అంతవరకు ఈ ప్రస్తావన తేకుండా ఉంటే బాగుంటుంది,” అని కాస్త ఘాటుగానే రష్మిక మందన సమాధానం చెప్పింది.
అయితే రష్మిక మందన నితిన్, అల్లు అర్జున్, సల్మాన్ దుల్కర్ తదితర చాలా మంది హీరోలతో కలిసి నటించింది. కానీ విజయ్ దేవరకొండతోనే ఆమెకు స్నేహం, ప్రేమ ఏర్పడ్డాయని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశః వారి మద్య అటువంటి కెమిస్ట్రీ కనిపించినందునే మీడియా వారు ప్రేమలో ఉన్నారని ఊహిస్తోందేమో?