విశాల్, తాబూ, శిల్పా శెట్టిలకు షూటింగులో గాయాలు

విశాల్, తాబూ, శిల్పా శెట్టి ముగ్గురు నటీనటులకు వేర్వేరు సినిమా షూటింగులలో గాయపడ్డారు. ఈరోజు ఉదయం చెన్నైలో ‘మార్క్ ఆంథోనీ’ సినిమా క్లైమాక్స్ ఫైయిటింగ్ సీన్ షూటింగులో పాల్గొన్నప్పుడు హీరో విశాల్ గాయపడ్డాడు. యూనిట్ సభ్యులు వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయించారు. విశాల్ ఇదే సినిమా షూటింగులో ఇదివరకు కూడా రెండుసార్లు గాయపడ్డాడు. తేరుకొని మళ్ళీ షూటింగులో పాల్గొంటుండగా మళ్ళీ ఈరోజు మరోమారు గాయపడ్డాడు. విశాల్‌ గాయపడటంతో సినిమా షూటింగ్ నిలిపివేశారు. 

బాలీవుడ్‌ సీనియర్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న భోలా సినిమా షూటింగ్ గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటులు తాబూ, శిల్పాశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ట్రక్కును బైక్‌లపై ఛేజింగ్ సీన్‌ను షూట్ చేస్తుండగా ట్రక్కు అద్దాలు పగిలి టాబూ నుదుటికి, కన్ను పైభాగంలో గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడింది. అయితే గాజుపెంకు కంటికి కాస్త పైన గుచ్చుకోవడంతో అదృష్టవశాత్తు కంటికి గాయం కాలేదు. టాబూకి చికిత్స చేసి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ చేశారు. 

ఇదే సినిమాలో పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్న శిల్పాశెట్టి కూడా యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా బైక్ మీద నుంచి కిందపడటంతో కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆమెను హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు ఆమె కాలికి కట్టువేశారు. కనుక అది తీసే వరకు ఆమె సినిమా షూటింగులో పాల్గొనలేదు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు గాయపడటంతో షూటింగ్ నిలిపివేసారు.