హవాయి చెప్పులు ఎందుకు వేసుకొని వస్తున్నానంటే...

లైగర్ సినిమా ప్రమోషన్స్‌తో యావత్ దేశాన్ని ఉర్రూతలూపుతున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏమి మాట్లాడినా ఆసక్తికరంగానే ఉంటుంది.. ఏం చేసినా విచిత్రంగానే ఉంటుంది. లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు వస్తున్నప్పుడు హవాయి చెప్పులు ధరించి వస్తుండటం చూసి అందరూ షాక్ అయ్యారు. ఎంత రౌడీ హీరో అయినా మంచి డ్రెస్ వేసుకొనివస్తున్నప్పుడు మంచి షూస్ కూడా వేసుకొని రావచ్చు కదా?అని సోషల్ మీడియాలో సన్నాయినొక్కులు వినిపిస్తున్నాయి. 

ముంబైలో లైగర్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనప్పుడు కూడా విజయ్ దేవరకొండ హవాయి చెప్పులు ధరించి వేదికపైకి రావడం గురించి ఓ విలేఖరి ప్రశ్నించగా, “లైగర్ సినిమా విడుదలకి ఇంకా రెండువారాలు మాత్రమే సమయం ఉంది. కనుక సినిమా ప్రమోషన్స్‌ కోసం ప్రతీరోజూ మ్యాచింగ్ షూస్ కోసం వెతుక్కొంటూ కూర్చోంటే టైమ్ వేస్ట్ అయిపోతుంది. కనుక హవాయి చెప్పులు కొనుకొన్నాను. ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకొన్నా సింపుల్‌గా హవాయి చెప్పులు వేసుకొని వచ్చేస్తున్నాను. షూస్ కంటే ఇవే చాలా సౌకర్యంగా ఉన్నాయి కూడా,” అని సమాధానం చెప్పారు.    

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ కిక్ బాక్సారుగా నటించాడు. బాలీవుడ్‌ భామ అనన్య పాండే హీరోయిన్‌గా, రమ్యకృష్ణ తల్లిగా నటించారు. లైగర్ ఆగస్ట్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.