నా టాటూని ఎవరూ కాపీ చేయొద్దు: నాగ చైతన్య

అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రదానపాత్రలు చేసిన లాల్ సింగ్ చడ్డా చిత్రం రేపు (గురువారం) విడుదల కాబోతోంది. ఆ సినిమాలో నాగ చైతన్య బాలరాజు అనే జవాను పాత్రలో నటించారు. కనుక ఆ సినిమా ప్రమోషన్స్‌లో నాగ చైతన్య కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. మీడియాకు ఆయన కనబడితే చాలు... మొట్ట మొదట ఆయన సినిమాల గురించి కాకుండా సమంతతో విడిపోవడం గురించే అడుగుతుంటారు. మళ్ళీ అదే జరిగింది. ముంబైలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాగ చైతన్య పాల్గొన్నప్పుడు, బాలీవుడ్‌ మీడియా ఆయన కుడిచేతి మణికట్టుపై ఉన్న టాటూ గురించి ప్రశ్నించగా, “అది సమంత, నేను పెళ్ళి చేసుకొన్న తేదీ. దాంతో నాకు ఎటువంటి ఇబ్బందీ లేదు అందుకే చెరిపించుకొనే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ టాటూ వెరైటీగా ఉండటంతో కొందరు అభిమానులు ఇలాంటి టాటూనే వేయించుకొన్నారు. కనుక ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ ఏమి చెప్పాలనుకొంటున్నానంటే, “ఇది మా పెళ్ళిరోజును సూచించే టాటూ. కనుక ఎవరూ దానిని వేయించుకోవద్దు” అని నాగ చైతన్య విజ్ఞప్తి చేశారు.