సీతారామం ట్రైలర్... నిజమే! యుద్ధంతో వ్రాసిన ప్రేమకధ

మహానటి సినిమాతో తెలుగువారి అభిమానహీరోగా మారిపోయిన దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం.. చిత్రానికి ట్యాగ్ లైన్‌ ‘యుద్ధంతో వ్రాసిన ఓ ప్రేమకధ’. ఈరోజు విడుదలైన ఆ సినిమా ట్రైలర్ చూస్తే అది నిజమే అనిపించకమానదు. జమ్ముకశ్మీర్ సరిహద్దులలో మంచుకొండలలో ఒంటరిగా కాపలాకాసే ఓ జవాను ప్రేమ కధే ఈ సినిమా కధ. 

అతని ప్రియురాలిగా మృణాల్‌ ఠాకూర్ నటించగా, రష్మిక మందన, సుమంత్, మురళీశర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. హనూ రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ వైజయంతీ మూవీస్, స్వప్నా మూవీస్ బ్యానర్‌లపై నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది.    

ట్రైలర్‌లో హీరోయిన్ “నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకి వదిలేసి వస్తారా?” అని ప్రశ్నిస్తే, దానికి సమాధానంగా “నాపాటికి నేను అనాధాలా బ్రతికేస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టింది కాకుండా దారి ఖర్చులు ఇస్తాననడం న్యాయమా?” అంటూ దుల్కర్ ప్రశ్నించడం చాలా చక్కగా చూపించారు. 

అతను వ్రాసిన లేఖను రష్మిక సీతకు చేర్చడం కోసం చాలా ప్రయత్నిస్తున్నట్లు ట్రైలర్‌లో చూపారు. అంటే సీతారామం ఎన్నడూ కలుసుకోలేదా? ఉత్తరాలతోనే వారి ప్రేమ కధ ముగిసిందా? మద్యలో రష్మిక పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు ఆగస్ట్ 5న సినిమా విడుదలయ్యాక సమాధానాలు లభిస్తాయి.