ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన థాంక్యూ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “థాంక్యూ సినిమా టికెట్ ధరల గురించి నేను ఒకటి చెపితే మీడియాలో మరోలా వచ్చింది. కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా వచ్చిందో నాకు అర్దం కాలేదు. థాంక్యూ సినిమా టికెట్ ధరలు కూడా ప్రభుత్వ జీవో ప్రకారమే ఉంటాయి. హైదరాబాద్, వరంగల్ వంటి పెద్ద నగరాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150+జీఎస్టీ, మల్టీప్లెక్స్ థియేటర్లలో అయితే రూ.200+ జీఎస్టీ ఉంటుంది. ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలకు తప్ప మిగిలిన అన్నీ సినిమాలకు ఇవే టికెట్ ధరలు ఉంటాయి.
థాంక్యూ సినిమా తొలి కాపీని ఇద్దరు వేర్వేరు వయసులున్నవారితో కలిసి చూశాను. ఇద్దరూ సినిమా చాలా బాగుందని చెప్పారు. నటన, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ చాలా అద్భుతంగా కుదిరాయి. ఈ సినిమా తప్పకుండా మా అందరి సినీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నాము,” అని అన్నారు.
నాగ చైతన్య, రాశీఖన్నా, మాళవికా నాయర్, ఆవికాగోర్ ప్రధాన పాత్రలు చేశారు. అక్కినేని కుటుంబానికి ఆత్మీయుడైన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుదలకు ఎంతోమంది తోడ్పడతారు. వారినందరినీ మరిచిపోకూడదనే చిన్న కాన్సెప్ట్ ని నమ్ముకొని దర్శకుడు ఈ సినిమా తీసినట్లు అర్దమవుతోంది. ఒకవేళ కధలో బలం లేకపోతే బలమైన స్క్రీన్ ప్లే చాలా తప్పనిసరి లేకుంటే సినిమా బోర్లాపడే ప్రమాదం కనిపిస్తోంది.