ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద విజయ్ దేవరకొండ భారీ కటవుట్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ట్రైలర్ గురువారం విడుదలవుతుండటంతో అభిమానులు హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గల సుదర్శన్ థియేటర్ వద్ద 75 అడుగుల ఎత్తున్న భారీ కటవుట్ ఏర్పాటు చేశారు. దానిలో కండలు తిరిగిన శరీరంతో జాతీయ జండా పట్టుకొని నిలబడినట్లు కటవుట్ రూపొందించారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల కటవుట్లే తప్ప సినిమా హీరోల కటవుట్లు కనబడటం లేదు. కనుక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ భారీ కటవుట్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. 

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మార్షల్ ఆర్ట్స్ కధాంశంగా రూపొందుతున్న లైగర్‌లో విజయ్ దేవరకొండ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నటించాడు. ప్రముఖ అంతర్జాతీయ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ విలన్ పాత్రలో నటించారు. కనుక వీరిరువురికీ మద్య ఓ ఫైటింగ్ సీన్ ఉంది. అది ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం. 

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుత్తున లైగర్‌ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు. లైగర్‌లో రమ్యకృష్ణ, విష్ణురెడ్డి, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు. లైగర్ ఆగస్ట్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.