సంక్రాంతికి ఆదిపురుష్... రెడీగా ఉండండి!

బాహుబలి తరువాత ప్రభాస్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడంటే అతిశయోక్తి కాదు. ఆ తరువాత ప్రభాస్ చేసిన, చేస్తున్న సినిమాల బడ్జెట్‌ రూ.300 కోట్లు పైమాటే తప్ప అంతకు తక్కువ ఉండటం లేదు. వాటిలో ఒకటి ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు  ఓం రౌత్ దర్శకత్వంలో రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తయారవుతోంది. 

ఇప్పటివరకు ప్రభాస్ పౌరాణిక పాత్రలు చేయలేదు. రామాయణ గాధ ఆధారంగా రూపొందుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. కనుక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ఉత్తరాది ప్రజలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  

ఈ సినిమాకు సంబందించి దర్శకుడు ఓం రౌత్ ఒక తాజా అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా 2023, జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. నేను కూడా మీలాగే ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో ఐమ్యాక్స్ త్రీడీలో ఈ సినిమా గ్రాఫిక్ సంబందించిన పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ 2021, నవంబర్‌లోనే పూర్తయింది. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిచేసి జనవరి 12న విడుదల చేస్తామని  దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు. 

ఈ సినిమాలో సీతమ్మవారిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, రావణాసురుడిగా సైఫ్ ఆలీఖాన్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. 

టీ సిరీస్ ఫిలిమ్స్, రిట్రోఫీలీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృశాన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: సాకేత్, పరంపర; కెమెరా: కార్తీక్ పళని, ఎడిటింగ్: అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే. 

ఆదిపురుష్ హిందీ, తెలుగులో నిర్మించి దానిని తమిళ్, కన్నడ, మలయాళంలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.