
బాహుబలితో ప్రభాస్ పేరు మారుమ్రోగిపోయినప్పటికీ ఆ తరువాత ఆ స్థాయిలో మళ్ళీ హిట్టు పడలేదు. రూ.350 కోట్ల భారీ పెట్టుబడితో మూడేళ్ళపాటు కష్టపడి తీసిన రాధేశ్యామ్ మూడు రోజులోనే బోర్లాపడి నిర్మాతలకు తీరని నష్టాలు మిగిల్చింది. అయినప్పటికీ ప్రభాస్ డిమాండ్ తగ్గలేదు... రెమ్యూనరేషన్ అసలే తగ్గలేదు. బాహుబలి తరువాత నుంచి ప్రభాస్ ఒక్కో సినిమాకి రూ.60 కోట్లు తీసుకొంటున్నట్లు టాక్. ఇంకా ఎక్కువే ఉండొచ్చు తప్ప అంతకంటే తక్కువ ఉండదని ఇండస్ట్రీలో టాక్.
ప్రస్తుతం ప్రభాస్ చేసినవి, చేయబోతున్నవీ అన్నీ కలిపి ఓ 4-5 సినిమాలు చేతిలో ఉన్నాయి. కనుక మరో మూడేళ్ళ వరకు ప్రభాస్‌కి ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైమ్ ఉండదని భావించవచ్చు. అయినప్పటికీ ప్రభాస్ కొత్తగా హోటల్ బిజినెస్‌లో దిగడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
మన దేశంలో దక్షిణాదిన ఒకటి, ఉత్తరాదిన ఒక స్టార్ హోటల్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండూకాక దుబాయ్, స్పెయిన్ దేశాలలో కూడా హోటల్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ముందుగా భారత్‌లో రెండూ నిర్మించడం పూర్తయిన తరువాతే విదేశాలలో హోటల్స్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈలోగా మరికొన్ని సినిమాలు... వాటితో బాటు భారీగా డబ్బు చేతికి వస్తుంది కూడా. ఈ హోటల్ బిజినెస్‌పై ప్రస్తుతం అతని టీం పనిచేస్తోంది. అన్ని ఓకే అనుకొంటే త్వరలోనే ప్రభాస్ స్వయంగా ఈవిషయం ప్రకటించవచ్చు.