దసరాకి వస్తున్న ది ఘోస్ట్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున చేస్తున్న తాజా చిత్రం పేరు ది ఘోస్ట్. ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ కానుకగా విడుదల చేస్తామని అన్నపూర్ణ స్టూడియోస్ ఈరోజు ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ చూసి ఇది కూడా ‘రాజుగారి గది’ వంటి హర్రర్ చిత్రం అనుకోవచ్చు కానీ ఈ యాక్షన్ ప్యాక్ చిత్రంలో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసరుగా నటిస్తున్నాడు. నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహ‌న్ నటిస్తోంది. 

సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఒకటి రెండు యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయవలసి ఉంది. ఆగస్ట్ నెలాఖరులోగా వాటినీ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టబోతున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా దసరా పండుగకే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయితే వారి అభిమానులకు పండగే కానీ వాటిలో బలహీనంగా ఉన్న సినిమాను రెండోది మింగేసే ప్రమాదం ఉంటుంది. కనుక ఈలోగానే రెండు సినిమాల దర్శక నిర్మాతలు మాట్లాడుకొని డేట్స్ మార్చుకొనే ప్రయత్నం చేయక తప్పదు.