నితిన్ నన్ను నలుగురిలో అవమానించాడు

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మా రాజశేఖర్ నటుడు నితిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మా రాజశేఖర్ దర్శకత్వం చేసిన హై ఫైవ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తన శిష్యుడిగా భావిస్తున్న  నితిన్‌ను ముఖ్య అతిధిగా ఆహ్వానించగా వస్తానని మాటిచ్చాడు కానీ రాలేదని అమ్మా రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమానికి నితిన్‌ వస్తానని చెప్పడంతో అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసుకొన్నానని చెప్పారు.  ఒకవేళ రాదలచుకోకపోతే ముందే చెపితే తాను వేరే ఏర్పటు చేసుకొనేవాడినని చెప్పారు. కానీ వస్తానని చెప్పి రాకపోవడం ఇంట్లో ఉండి కూడా రాకపోవడం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. ఒకవేళ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి రాలేకపోతే కనీసం ఓ వీడియో బైట్ చేసి పంపించమని అడిగినా పంపించలేదని, ఏమంటే తనకు జ్వరం వచ్చిందని చెప్పి తప్పించుకొన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా తనకు జీవితంలో తోడ్పడినవారిని ఎన్నడూ మరిచిపోకూడదని కానీ నితిన్‌కు ఆ కృతజ్ఞత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనను నలుగురిలో అవమానించినట్లే భావిస్తున్నానని అమ్మా రాజశేఖర్ అన్నారు.