కోలీవుడ్ హీరో విక్రమ్‌కు గుండెపోటు.. హాస్పిటల్‌లో అడ్మిట్

కోలీవుడ్ నటుడు చియాన్ విక్రమ్‌కు శుక్రవారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయనకు స్వల్ప స్థాయిలో (మైల్డ్ స్ట్రోక్) గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ వైద్యులు స్పష్ఠత ఈయవలసి ఉంది. చియాన్ విక్రమ్‌కు గుండెపోటు వచ్చి హాస్పిటల్‌లో చేర్చారని తెలియగానే చెన్నైలోని ఆయన అభిమానులు భారీగా కావేరీ హాస్పిటల్‌ వద్దకు చేరుకొని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరికొంత మంది త్వరగా కోలుకొని తిరిగి వచ్చి మరిన్ని మంచి సినిమాలు చేయాలని సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. 

అంతకు ముందు తెలుగువారికి అపరిచితుడుగా ఉన్న విక్రమ్ అపరిచితుడు సినిమాతో చిరపరిచితుడైయ్యారు. ఆ తరువాత విక్రమ్ నటించిన అనేక తమిళ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదలయ్యాయి. విక్రమ్ నటించిన పోన్నియన్ సెల్వన్ అనే తమిళ్ సినిమా టీజర్‌ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదలకావలసి ఉంది. ఆ కార్యక్రమంలో విక్రమ్ పాల్గొని టీజర్‌ విడుదల చేయవలసి ఉండగా ఇంతలో ఆసుపత్రి పాలయ్యారు.