
హిందువుల మనోభావాలు దెబ్బతినే విదంగా హిందూ దేవతామూర్తుల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, దేవతామూర్తుల బొమ్మలను అనుచితమైన విదంగా ముద్రించడం, సినిమాలలో హిందూ దేవతామూర్తులను అవహేళన చేస్తూ చూపడం వంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడుకి చెందిన మణిమేఖలై అనే దర్శకురాలు కాళీ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు. ఇటీవల ఆ చిత్రానికి సంబందించిన ఓ పోస్టరును ఆమె కెనడాలో విడుదల చేశారు. దానిలో హిందువుల ఆరాధ్యదైవమైన కాళీమాత (పాత్రధారి) సిగరెట్ కాలుస్తున్నట్లు చూపారు. ఆమె ఓ చేత్తో సిగరెట్ త్రాగుతూ మరోచేత్తో స్వలింగ సంపార్కులని సూచించే ఏడురంగుల జెండాని పట్టుకొన్నట్లు చూపారు.
దీనిపై భారత్, అమెరికాతో సహా కెనడాలో కూడా హిందువులు, హిందూ సంస్థల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒట్టావాలోని హిందూ సమాజం నుంచి తమకు పిర్యాదులు అందాయని కెనడాలోని భారత్ హైకమీషన్ అధికారులు తెలిపారు. ఈ డాక్యుమెంటరీని, పోస్టర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీలో హిందూ సంస్థలు పోలీస్స్టేషన్లో పిర్యాదులు చేశాయి.
ఈ వివాదాస్పద పోస్టరుపై దర్శకురాలు మణిమేఖల స్పందిస్తూ, “మనోభావాల పేరుతో కళాకారుల భావప్రకటన స్వేచ్చను కట్టడిచేయాలనుకోవడం సరికాదు. నేను నా అభిప్రాయాలను, భావాలను నిర్భయంగా వినిపిస్తూనే ఉంటాను. అందుకు నా జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సివచ్చినా నేను భయపడబోను,” అని అన్నారు.