ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తారో కానీ...

కోలీవుడ్ నటుడు విశాల్ 2024లో ఏపీలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో చిత్తూరు జిల్లా కుప్పం నుంచి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పోటీ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆ పుకార్లను గురించి ప్రస్తావిస్తుండటంతో వాటిపై విశాల్ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. 

“నేను ఏపీ రాజకీయాలలో ప్రవేశించబోతున్నానని, కుప్పం నుంచి నేను పోటీ చేయబోతున్నానని వస్తున్న పుకార్లు నా దృష్టికి వచ్చాయి. వాటిలో నిజం లేదు. వాటిని నేను ఖండిస్తున్నాను. అసలు వీటి గురించి నాకు తెలియనే తెలియదు. ఇటువంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో తెలియదు. నన్ను ఏ రాజకీయ పార్టీ కలవలేదు. నాకు నా సినిమాలతోనే సరిపోతోంది. ఏపీ రాజకీయాలలో ప్రవేశించే ఉద్దేశ్యం కూడా నాకు లేదు,” అని విశాల్ ట్వీట్ చేశారు.   

ప్రస్తుతం విశాల్ లాఠీ అనే ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. దానిలో విశాల్‌కు జోడీగా సునయన చేస్తోంది. వినోద్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విశాల్ మిత్రులు రమణ, నంద కలిసి నిర్మిస్తున్నారు.