వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా జూన్ 10నా విడుదలైంది. సినిమాకు పాజిటివ్ ట్రాఫిక్ వచ్చినప్పటికీ రన్ టైమ్ (మూడు గంటలు) ఉండటంతో అది సినిమా కలెక్షన్స్‌పై చాలా ప్రభావం చూపుతోంది. అయితే తమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని నాని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సస్ మీట్‌లో నానితో సహా చిత్ర బృందం అంతా పాల్గొంది.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ,”ఈ సినిమా విజయాన్ని మేము కలెక్షన్స్ రూపంలో కొలవదలచుకోలేదు. ఈ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణను మాత్రమే పరిగణనలోకి తీసుకొని మా సినిమా విజయోత్సవాన్ని మీ అందరితో కలిపి ఈవిదంగా జరుపుకొంటున్నాము. ఈ సినిమా నా కెరీర్‌లో అత్యుత్తమైనది. రుచికరమైన ఆవకాయ వంటి ఈ చిత్రాన్ని తీయడానికి మేమందరం ఎంతో కష్టపడ్డాము. ప్రేక్షకులు కూడా చక్కగా ఆదరిస్తున్నారు. ఇటువంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు మీడియా కూడా దీని గురించి ప్రజలకు తెలిసేలా చేసి తోడ్పడాలని నేను కోరుకొంటున్నాను. ఈ ఏడాది చివరిలో నేను ఎన్ని మంచి సినిమాలు చేశానని చెప్పుకోవాలంటే వాటిలో తప్పకుండా అంటే సుందరానికి అగ్రస్థానంలో ఉంటుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని మేము మనసారా నమ్ముతున్నాము. ఇది హిట్టా కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది,” అని అన్నారు.