సినిమా ప్రమోషన్ కోసం ఏపీలో కొండా దంపతుల పర్యటన

మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతుల జీవిత కధ ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తీసిన సినిమా కొండా ఈ నెల 23వ తేదీన విడుదల కాబోతోంది. కనుక ఈ సినిమా ప్రచారం కోసం కొండా దంపతులు ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్నారు. 

ఈరోజు విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద గల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి మీడియాతో మాట్లాడుతూ, “వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలననే మాకీ గుర్తింపు, గౌరవం లభించాయి. అందుకు మేము సర్వదా ఆయనకు రుణపడిఉంటాము. టిఆర్ఎస్‌, బిజెపి డబ్బుతో రాజకీయాలను శాశిస్తుండటంతో రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. ఒకవేళ ఆనాడు మేము మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నప్పటి పరిస్థితులు తెలంగాణలో నెలకొని ఉంటే టిఆర్ఎస్‌ నేతలు ఇళ్ళ గుమ్మాలు దాటి బయటకు అడుగుపెట్టగలిగేవారే కాదు. టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు భూములు ఇవ్వకపోగా మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన భూములను కూడా బలవంతంగా లాగేసుకొంటోంది. 

ఈ సినిమా మా ఇద్దరి మద్య ప్రేమ, మావోయిస్టులుగా మా ఇద్దరి పోరాటాలు, పెళ్లి, రాజకీయాల కధాంశంతో రూపొందింది. ఈ సినిమాలో మా గురించి చాలా మందికి తెలియని అనేక విషయాలు చూపించబోతున్నారు. కనుక మా ఈ కొండా సినిమాను ప్రజలందరూ ఆదరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.