
వేణు ఊడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రలలో విరాటపర్వం చిత్సం ఈ నెల 17వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకొంది.
తన సినీ కెరీర్ ముగిసిందనిపించిన రోజున వైద్య వృత్తిలో ప్రవేశించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని సాయి పల్లవి చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు చాలా అభిమానమని, ముఖ్యంగా ఆయన డ్యాన్సులకు తాను ఫిదా అయిపోయానని చెప్పారు. ఆయనతో ఎప్పటికైనా కలిసి డాన్స్ చేయాలని తన కల అని సాయిపల్లవి తెలిపింది. భోళా శంకర్‌లో తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి డాన్స్ చేసే అవకాశం వచ్చింది కానీ అది రీమిక్స్ సాంగ్ అని తెలియగానే ఆ అవకాశం వదిలేసుకొన్నానని సాయి పల్లవి చెప్పింది. ఎందుకంటే రీమిక్స్ సాంగ్స్‌లో ప్రేక్షకులు ఒరిజినల్ సాంగ్‌ను, దానిలో డ్యాస్ చేసినవారితో పోల్చు చూస్తారని అందుకే తాను రీమిక్స్ సాంగ్స్ చేసేందుకు ఇష్టపడనని చెప్పింది.
జార్జియాలో వైద్య విద్య అభ్యసిస్తున్నప్పుడు అక్కడ సుప్రసిద్దమైన టాంగో డాన్స్ నేర్చుకొన్నానని సాయి పల్లవి తెలిపింది. ఆ డాన్స్ కోసం అక్కడి పద్దతి ప్రకారం పొట్టి దుస్తులు ధరించాల్సి వచ్చిందని, అక్కడ అటువంటి దుస్తులు ధరించి డ్యాన్స్ చేయడం సహజమే కనుక అప్పుడు ఏమీ ఇబ్బంది పడలేదని తెలిపింది. కానీ తాను ప్రేమమ్ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడు అనేకమంది తన గురించి, తాను వేసుకొన్న ఆ పొట్టి బట్టల గురించి ట్రోల్ చేశారని సాయి పల్లవి తెలిపింది. అది తనకు, తన కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందికరంగా మారిందని అప్పటి నుంచే సినిమాలలో ఎన్నడూ పొట్టి దుస్తులు ధరించకూడదని నిర్ణయించుకొన్నానని సాయి పల్లవి చెప్పింది.