నెట్‌ఫ్లిక్స్‌లో నయన్, శివన్‌ పెళ్ళి వేడుక

ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ముచ్చటగా ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని సముద్రతీరంలో గల షేర్టన్ గార్డెన్‌లో గురువారం కన్నుల పండుగగా వారి వివాహ కార్యక్రమం జరిగింది. విఘ్నేశ్ శివన్ అభ్యర్ధన మేరకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళసూత్రం అందించగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఉదయం 9.30 గంటలకు నయనతార మెడలో మూడు ముళ్ళు వేశాడు. 

నయనతార ఎర్రటి ఎరుపు రంగు చీర కట్టుకొని, మెడలో పెద్ద పచ్చలహారం, మరో రెండు పెద్ద బంగారుహారాలను ధరించి మిలమిల మెరిసిపోతూ పెళ్ళి మండపంలో అడుగుపెట్టినప్పుడు అతిధులు అందరూ చప్పట్లు కొడుతూ ఆమెను ఆహ్వానించారు. విఘ్నేశ్‌ శివన్‌ సాంప్రదాయబద్దమైన పంచెకట్టులో హుందాగా వచ్చాడు. మంగళసూత్రధారణ తరువాత విఘ్నేశ్‌ శివన్‌ ఇంతకాలంగా ప్రేమించి పెళ్ళాడిన తన భార్య నయనతార నుదుటన ఆప్యాయంగా ముద్దు పెట్టుకొన్నాడు.   

అంగరంగ వైభవంగా సాగిన వారి వివాహ వేడుకకి కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, రాధిక, అజిత్ కుమార్, విజయసేతుపతి, సూర్య, కార్తీ, కుష్బూ, సుందర్, విక్రమ్ ప్రభు, దర్శకులు మణిరత్నం, గౌతమ్ మీనన్, అట్లీ, సంగీత దర్శకులు ఏఆర్ రహ్మాన్, అనిరుద్ తదితరులు హాజరయ్యి నవదంపతులను ఆశీర్వదించారు. బాలీవుడ్ నుంచి షారూక్ ఖాన్, నిర్మాత బోణీ కపూర్ హాజరయ్యి నయన్, శివన్‌లను ఆశీర్వదించారు. టాలీవుడ్‌ నుంచి ఎవరెవరు వీరి పెళ్ళికి హాజరయ్యానేది ఇంకా తెలియవలసి ఉంది. 

ఈ వివాహ వేడుక ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. కనుక కన్నుల పండుగగా సాగిన వారి వివాహవేడుక త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. వారి పెళ్ళి ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినందున చాలా పరిమిత సంఖ్యలో వారి వివాహ ఫోటోలు విడుదలచేశారు. కానీ ఆ కొన్ని ఫోటోలలోనే వారి వివాహం ఎంత ముచ్చటగా సాగిందో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. గ్యాలరీలో ఉన్న వారి పెళ్ళి ఫోటోలను మీరూ చూసి ఆనందించండి.