
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టీజర్ సాయంత్రం విడుదలైంది. రేపు బాలకృష్ణ పుట్టినరోజు కనుక ఒక రోజు ముందుగానే అభిమానుల కోసం ఆయన 107వ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. పులిచర్ల ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తోంది కనుక బాలయ్య మార్క్ పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉండబోతున్నాయని టీజర్ చూస్తే అర్ధం అవుతోంది. “నేను నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలు కూడా గుర్తుపట్టలేరు... నా కొడకల్లారా...” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానులకు తెగనచ్చేయవచ్చు కానీ బాలయ్య వంటి సీనియర్ నటుడు ఇటువంటి డైలాగులకు దూరంగా కాస్త హుందాగా ఉండేవి ఎంచుకొంటే మంచిదనిపిస్తుంది.
ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయనందున ప్రస్తుతానికి #NBK107తోనే టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రుతీ హాసన్ బాలయ్యకు జోడీగా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోస్, లాల్ పాల్, చంద్రిక రవి తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవికుమార్ కలిసి నిర్మిస్తున్నారు.
కధ:, దర్శకత్వం: గోపీచంద్ మలినేని, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: రిషి పంజాబీ, ఎడిటింగ్: నవీన్ నూలి, సంగీతం: ఎస్. తమన్.