కాబోయే భర్త దర్శకత్వంలో నయనతార ఓ2 చిత్రం

ఈ నెల 10వ తేదీన నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ మహాబలిపురంలో వివాహం చేసుకోబోతున్నారు. వారి వివాహానికి రెండు రోజుల ముందు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో నయనతార ప్రధానపాత్రలో నటించిన ఓ2 (o2) చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. వారి పెళ్ళైన వారం రోజులకి అంటే జూన్‌ 17వ తేదీన ఈ సినిమా నేరుగా డిస్నీ +హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కాబోతోంది.   

ఆక్సిజన్‌కు శాస్త్రీయనామం ఓ2 పేరుతో రూపొందించిన ఈ చిత్రంలో నయనతార ఓ చిన్నపిల్లాడికి తల్లిగా నటించింది. శ్వాససంబంధిత వ్యాధితో బాధపడుతున్న కుమారుడితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు దారిలో ఓ సొరంగమార్గంలో చిక్కుకుపోతుంది. 

సొరంగ మార్గంలో చిక్కుకొన్న వారిని కాపాడేందుకు అధికారులు, సహాయ బృందాలు బయట నుంచి ప్రయత్నాలు చేస్తుండగా, మరోపక్క సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన బస్సులో ఆక్సిజన్  సిలిండర్ ఖాళీ అయిపోతుంటే కొడుకు ప్రాణాలను కాపాడుకొనేందుకు నయనతార ఏమి చేసింది? ఏవిదంగా అందరూ బయటపడ్డారు?అనేది ఈ సినిమా కధాంశం. ట్రైలర్‌ చూస్తే సినిమా చాలా గొప్పగా ఉండబోతోందని అర్ధమవుతుంది. 

ఓ2లో నయనతార, రిత్విక్ ప్రధాన పాత్రలలో నటించారు. యస్ఆర్ ప్రకాశ్ బాబు, యస్ఆర్.ప్రభు కలిసి డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఓ2ని తెరకెక్కించారు. మళ్ళీ చాలా రోజుల తరువాత నయనతార నటించిన ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.