
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 20 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా వారిద్దరికీ ఎంతో పేరు తెచ్చింది. నేటికీ కమల్ హాసన్ బెస్ట్ మూవీలలో అది కూడా ఒకటిగా నిలుస్తుంది. ఆ స్పూర్తితోనే వారిద్దరూ మళ్ళీ 2019 లో భారతీయుడు-2 (ఇండియన్-2) మొదలుపెట్టారు. అయితే ఈసారి ఆ సినిమాకు మొదటి నుంచి వరుసగా సమస్యలు ఎదురవుతూనే ఉండటంతో నేటికీ అది పూర్తి కాలేదు.
2019లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి భోపాల్, చెన్నై, రాజమండ్రిలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేశారు. కానీ 2020, ఫిబ్రవరిలో చెన్నైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగి దానిలో కొందరు టెక్నీషియన్స్ చనిపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది.
మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టేసమయానికి కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టేసింది. దాంతో కొన్ని నెలలు వాయిదా పడింది. సినిమా షూటింగ్ అనుకొన్న సమయానికి పూర్తికాకుండా అలా ఏళ్ళ తరబడి కొనసాగుతుండటం వలన సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. దాంతో దర్శక నిర్మాతల మద్య గొడవలు జరిగాయి.
ఆ సినిమా ఎంతకూ పూర్తికాకపోవడంతో కమల్ హాసన్ మద్యలో విక్రమ్ సినిమా పూర్తి చేసేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇండియన్-2 నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితులలో దానిని పూర్తి చేసి త్వరలోనే విడుదల చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను. దీనితోనే మరో పదేళ్ళు కొనసాగలేము కదా? కనుక శంకర్, లైకా ప్రొడక్షన్స్ ఇద్దరితో మాట్లాడి త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టి పూర్తి చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను,” అని చెప్పారు.