
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో ఎఫ్3 సినిమా మే 27న థియేటర్లలో విడుదలై తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారికి వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ ముగ్గురూ ఓ వీడియో సందేశం ద్వారా ఎఫ్3 భాషలోనే ఓ దుర్వార్త చెప్పారు.
దానిలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ “ఎఫ్3 సినిమాను థియేటర్లలో చూడకపోయినా నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుందిలే... అని అనుకొన్నారు కదా...” అని అంటే, వెంకటేష్ అందుకొని “ఇటీజ్ నాట్ కమింగ్ అమ్మా... 4 వారాల్లో రాదమ్మా... 8వారాల తరువాతే వస్తుందమ్మా...” అంటారు.
వరుణ్ తేజ్ మళ్ళీ అందుకొని “రెండు నెలల తరువాతే వస్తుంది... “ అని తన స్టైల్లో చెపుతాడు. అప్పుడు అనిల్ రావిపూడి అందుకొని “కనుక అందరూ థియేటర్స్ కే వచ్చి ఎఫ్3 చూసి ఈ సమ్మర్‌లో బాగా నవ్వుకోండి...” అని చెప్పాడు. “ఓన్లీ ఇన్ థియేటర్స్...వాచ్ అండ్ ఎంజాయ్” అని ముగించారు.
ఇదీ... ఓటీటీ ప్రేక్షకులకు వారు ముగ్గురూ ఎఫ్3 గురించి చెప్పిన దుర్వార్త. కనుక మరో రెండు నెలలు వేచి చూడలేమనుకొంటే వెంటనే థియేటర్స్‌కి వెళ్ళి ఎఫ్3 వంటి ఓ మంచి సినిమాను చూసి మనం కూడా కలెక్షన్లు పెంచకతప్పదు.