నట్టి కుమార్‌తో రాంగోపాల్ వర్మ ఫైట్ ముగిసేలా లేదు!

దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటిపేరు వివాదాస్పద అనుకొనేవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మీడియా ఆయన గురించి చెప్పెటప్పుడు వివాదాస్పద దర్శకుడు అనే చెపుతుంటుంది. ఆ పేరును నిలబెట్టుకొంటున్నట్లు తాజాగా నిర్మాత నట్టి కుమార్‌ కుమారులు నట్టి క్రాంతి, నట్టి కరుణలు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ‘మా ఇష్టం’ సినిమాను అడ్డుకొనేందుకు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్‌ వేశారంటూ రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై నట్టి కుమార్‌ కూడా వెంటనే తీవ్రంగానే స్పందించారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, “రాంగోపాల్ వర్మ ఆ సినిమా కోసం మా దగ్గర డబ్బు అప్పు తీసుకొని అడిగితే తిరిగి ఇవ్వకుండా మా మీదే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి బెదిరిస్తున్నాడు. 

ఆయన ఇండస్ట్రీలో చాలా పాపులర్ కనుక ఆయన సంగతి తెలియనివారు ఆయన చెప్పే మాయమాటలు నమ్మి డబ్బు అప్పిచ్చి నాలాగే మునిగిపోతుంటారు. కనుక నిర్మాతలు, ఫైనాన్సర్స్ ఎవరూ ఇకపై ఆయనకు డబ్బు అప్పు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నాలాగ రాంగోపాల్ వర్మ చేతిలో మోసపోయిన వారందరూ ఏకమై, మా బాకీలు తీర్చేవరకు ఇకపై ఆయనకు సంబందం ఉన్న ఏ సినిమా కూడా థియేటర్లో రిలీజ్ కాకుండా కోర్టులో కేసులు వేసి అడ్డుకొంటాము,” అని హెచ్చరించారు.

సినీ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఆర్ధిక లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. కానీ గత 10-15 సంవత్సరాలుగా ఇటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో యువ నటీనటులు ఎంచక్కగా కలిసి పనిచేస్తూ చక్కటి వాతావరణం సృష్టిస్తుంటే, దర్శకులు, నిర్మాతలు, ఫైనాన్సర్స్ మద్య వాతావరణం మాత్రం పూర్తిగా చెడినట్లే కనిపిస్తోంది. 

సినీ ఇండస్ట్రీలో సీనియర్స్ పెద్దరికానికి, వారి సలహాలు, సూచనలకు ఎవరూ గౌరవించక పోవడం వలన వారు కూడా ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు. బహుశః అందుకే ఇండస్ట్రీలో పరిస్థితులు మరింత చెడిపోతున్నట్లు భావించవచ్చు. ఇది ఇండస్ట్రీలో ఎవరికీ మంచికాదు.