చెక్ బౌన్స్ కేసులో జీవితకు కోర్టు నోటీస్

చెక్ బౌన్స్ కేసులో జీవితకు కోర్టు నోటీస్ జారీ చేసింది. గరుడవేగ సినిమా కోసం డా.రాజశేఖర్ దంపతులు 2017లో తమ ఆస్తి పత్రాలను తాకట్టుగా పెట్టి రూ.26 కోట్లు అప్పు తీసుకొన్నారని కానీ తిరిగి చెల్లించడంలేదని సినీ ఫైనాన్సర్, జో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత కోటేశ్వరరాజు, ఆయన భార్య హేమ చిత్తూరు జిల్లాలో తిరువళ్ళూరు కోర్టులో కేసు వేశారు. 

ఆ పత్రాలు తమ వద్ద ఉండగానే డా.రాజశేఖర్ దంపతులు నకిలీ పత్రాలతో ఆ ఆస్తులను వేరే వారికి అమ్ముకొన్నారని వారు ఆరోపించారు. అయితే వారి ఆరోపణలను జీవిత ఖండించారు. కానీ కోటేశ్వర రాజు దంపతుల వద్ద నుంచి రూ.26 కోట్లు అప్పు తీసుకొన్నామా లేదా?దానిని తిరిగి ఇచ్చేశామా లేదా?అనే విషయం చెప్పనేలేదు. “మేమెవరినీ మోసం చేయలేదు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కనుక ఇప్పుడేమీ మాట్లాడలేమని,” మాత్రమే చెప్పారు. 

అయితే ఆ అప్పుకు ష్యూరిటీగా డా.రాజశేఖర్ దంపతులు వారికిచ్చిన రూ.13 కోట్లకు చెక్కులు బౌన్స్ అవడంతో కోటేశ్వరరాజు, హేమ దంపతులు తిరువళ్ళూరు కోర్టులోనే వేరేగా చెక్ బౌన్స్ కేసు కూడా వేశారు. డా.రాజశేఖర్ దంపతులు తమకు ఇచ్చిన అన్ని చెక్కులను బ్యాంకులు తిరస్కరించాయని, కనుక తాము ఇచ్చిన సొమ్ములో కనీసం పావు శాతం తక్షణం తమకు ఇప్పించాలని వారు న్యాయస్థానాన్ని కోరారు. 

ఆ చెక్ బౌన్స్ కేసు విచారణకు డా.రాజశేఖర్ దంపతులు హాజరుకాకపోవడంతో ఈ కేసును మే 30కి వాయిదా వేసి ఆరోజు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తూ డా.రాజశేఖర్ దంపతులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

జీవిత మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి తాము చాలా న్యాయంగా, ధర్మంగా జీవిస్తుంటామని, ఎవరినీ మోసం చేయలేదని అటువంటి ఆలోచన కూడా తమకు కలగదని చెపుతుంటారు. కానీ వాస్తవం చూస్తే ఈవిదంగా ఉంది. మీడియా ముందుకు వచ్చి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ వాటితో ఆర్ధిక లావాదేవీలు ముగిసిపోవు. పైగా ఇంకా జటిలమవుతాయని తాజా నోటీస్ నిరూపిస్తోంది. 

కనుక ఒకవేళ డా.రాజశేఖర్ దంపతులు నిజంగా వారికి బాకీ ఉన్నట్లయితే నిజాయితీగా ఒప్పుకొని మరికొంత గడువు తీసుకొని డబ్బు తిరిగి చెల్లించడం చాలా మంచిది లేకుంటే ఆ తరువాత చింతించి ప్రయోజనం ఉండదు.