తెలుగు సినీ పరిశ్రమతో దశాబ్ధాలుగా అనుబందం పెనవేసుకొన్న ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి (74) బుదవారం చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుదవారం తుది శ్వాస విడిచారు.
రామకృష్ణా రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లాలోని గూడూరు. తల్లితండ్రుల పేర్లు మస్తానమ్మ, సుబ్బరామిరెడ్డి. 1948, మార్చి 8న జన్మించారు. గూడూరులో విద్యాభ్యాసం పూర్తయ్యాక, మైసూర్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత మళ్ళీ గూడూరు వచ్చి సిమెంట్ రేకుల వ్యాపారం చేసుకొంటుండగా, ఆయన బంధువు, ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రెడ్డి ప్రోత్సాహంతో 1973లో శ్రీ రామకృష్ణా ఫిల్మ్స్ అనే సంస్థ స్థాపించి సినీ పరిశ్రమలో ప్రవేశించారు.
మొదట రంగనాధ్, శారదలు హీరోహీరోయిన్లుగా అభిమానవంతులు సినిమా తీశారు. అది సూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుంచి రామకృష్ణా రెడ్డి మరి వెనుతిరిగి చూసుకోలేదు. ఆ రోజుల్లో కుటుంబ కధా చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ ఉండటంతో ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వైకుంఠపాళి, గడుసు పిల్లోడు, మా ఊరి దేవత, అల్లుడుగారు జిందాబాద్, మూడిళ్ల ముచ్చట, సీతాపతి సంసారం, అగ్ని కెరటాలు, మాయగాడు వంటి సినిమాలను నిర్మించి వరుస విజయాలు అందుకొన్నారు. ఆయన మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.