ఆర్ఆర్ఆర్ ఓటీటీలో వచ్చేస్తోంది కానీ...

దర్శకుడు రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదిగో పులి అంటే... అదిగో తోక అన్నట్లుగా ఆర్ఆర్ఆర్ ఫలానా తేదీ నుంచి ఫలానా ఓటీటీలో వచ్చేస్తోందంటూ ఒకటే పుకార్లు పుట్టిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ ఈనెల 20వ తేదీ నుంచి జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో విడుదల కానుంది. అయితే ఆర్ఆర్ఆర్‌కున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని, ఓటీటీ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమా చూసేందుకు కొంత ఛార్జీని వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత జూన్ 3వ తేదీ నుంచి ఆయా ఓటీటీల ఖాతాదారులకు ఉచితంగా చూసే అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ చిత్రం రూ.1,000 కోట్లు పైనే వసూలు చేసి ఇంకా కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తూనే ఉంది. ఓటీటీ హక్కుల ద్వారా కూడా నిర్మాతలకు బాగానే ముట్టింది. అయినా ఓటీటీ ప్రేక్షకుల వద్ద నుంచి కూడా ఇంకా రాబట్టాలనుకోవడం నిజమైతే వారి ఆశకు అంతులేదనుకోవాలి.